దైవభక్తి వేరు, ప్రజాసేవ వేరు -
అని కొందరి దురభిప్రాయం. ధర్మమూ, భక్తి కూడా భూతదయను
ప్రధానంగా బోధిస్తున్నాయి.సాటి మనిషి ఆర్తిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? అనే దానికి మన ధార్మిక గ్రంథాలలో చక్కని ఆదర్శాలను
చూపించారు.
'సత్యధర్మ'నిరతుడైన శిబి చక్రవర్తి
గాథను మహాభారతంలో ఉపాఖ్యానంగా అందించాడు వ్యాసుడు. ఒకసారి ఒక పావురం భయంతో శిబి
వద్దకు వచ్చింది. తనను తరుముతున్న డేగనుండి తనను కాపాడమని శరణు వేడింది. ఆర్తిలో
ఉన్న కపోతానికి అభయమిచ్చాడు రాజు.
ఈ లోపల డేగ వచ్చి, తనకు ప్రకృతి సిద్ధమైన
ఆహారాన్ని దూరం చేయడం పాడి కాదని, తన ఆకలి తీర్చమని
చెప్పింది. ఇది కూడా ధర్మమే. ఇప్పుడు పరస్పర విరుద్ధంగా కనిపించే రెండు ధర్మాలను
చక్కగా సమన్వయించాడు శిబి.
పావురాయిని త్రాసులో ఒకవైపు వుంచి, మరొకవైపు తన తొడలోంచి మాంసాన్ని కోసి ఉంచాడు. (వేరే పక్షినో,
పశువునో చంపకుండా, తనంత తానూ తన మాంసాన్నివ్వడం గమనార్హం) కానీ ఆ మాంసం
చాలకపోయేటప్పటికి ఆశ్చర్యపోయి తానె ఆ సిబ్బిలో కూర్చున్నాడు.
ఈ త్యాగానికి ముగ్ధులై, ఆ పావురం, డేగ నిజరూపాలతో గోచరించాయి.
అతడి ధర్మ నిరతిని పరీక్షించడానికి వచ్చిన ఇంద్రుడు, అగ్నిదేవుడు ఆ రెండు పక్షులు.
ఈ కథలో త్యాగవైభవాన్ని ఆవిష్కరించడమే ఋషి హృదయం.
బాధలో ఉన్న పశు పక్ష్యాదుల్ని రక్షించడమే గొప్ప ధర్మమని
చెప్పినప్పుడు, సాటి మానవులను కాపాడడం కనీస
కర్తవ్యమని వేరే చెప్పనవసరం లేదు. భీతున కభయంబును, ఆర్తునకు శరణంబును,
ఋభుక్షునకన్నంబును...." సమకూర్చడం గృహస్థుల
కర్తవ్యమని భారతంలోని మాట.
అహమిచ్చా వచైః ద్రవ్యైః క్రియయోత్పన్న యోనఘే!
నైవతుప్యేర్చితోర్చాయాం భూత గ్రామావమానినః!!
"ప్రాణులను బాధించే వ్యక్తీ - ఎన్నో రకాల ద్రవ్యాలతో,
పద్ధతులతో నా ప్రతిమలను పూజిమ్చినప్పటికీ నేను
సంతోషించను." అని సాక్షాత్తు భగవంతుడే చెప్పిన మాట. (కపిల గీత -
శ్రీమద్భాగవతం).
ద్విషతః పరకాయ మాం మానినో భిన్న దర్శినాం!
భూతేషు బద్ధ వైరస్య మనః శాంతిమృచ్చతి!!
"ఇతరుల శరీరాలలో ఉన్న నన్ను ద్వేషించిన వాడు, భిన్నంగా చూసేవాడు, ప్రానులతో వైరం
కలిగిన వాడు ఏనాడు చిత్తశాంతిని పొందడు.? అని కూడా భాగవతం
హెచ్చరించింది. అంతేకాదు - సర్వభూతాలలో పరమాత్మ ఉన్నాడు, నిజమైన దైవభక్తుడు భగవద్ద్రుష్టితో మానవసేవ చేస్తాడు. సకల
ప్రాణులలో ఉన్న పరమేశ్వరుని ఉపేక్షించి, కేవలం
అర్చామూర్తులను పూజించడం 'బూడిదలో ఆహుతినివ్వడమే/నని
కపిల మహర్షి బోధ.
"నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయజేయగదే" అని
పోతన గారు భాగవతంలో పలికించారు. భూతదయో దైవభక్తికి ప్రాణం.
అరణ్యాలలో ఆర్తులైన ఋషులను ఆదుకున్న రామభద్రుడు ఆర్తత్రాణ
పరాయణుడని ఖ్యాతి గడించాడు. విషపూరితమైన జలాలనుమ్ది జలాలను విషపు బారి నుండి,
దావాగ్నుల నుండి తన తోటి వర్గీయులను కాపాడిన
శ్రీకృష్ణుడు ఆపద్బాంధవుడయ్యాడు.
ఇతరులు వేదనలో ఉన్నప్పుడు, తానూ విందులారగించే వాడు పాపి - అని పురాణ మతం. తను
తినబోతున్న ఆహారాన్ని, ఆకలితో ఉన్న కుక్కకు
అందించిన రంతిదేవుని భాగవతోత్తమునిగా కీర్తించారు ఋషులు.
ప్రతివ్యక్తీ మరోవ్యక్తికి ఏదో ఒక సాయం చేయగలిగే స్తోమత భగవంతుడు
అందరికీ ప్రసాదించాడు. శారీరక సహాయం, ఆర్ధిక సహాయం,
ద్రవ్యదానం...ఇలా ఏదో ఒక రూపంలో తామేమి చేయగలరో
తామే చిత్తశుద్ధితో తెలుసుకుంటే చాలు. చేయగలిగిన దాన్ని చేస్తే చాలు. ఇలా అందరూ
ఆలోచిస్తే ఆనందకరమైన సమాజాన్ని ఆవిష్కరించడం సులభసాధ్యమే.