ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

శ్రీరాముడు రావణ సంహారనంతరం, బ్రహ్మ హత్య పాతకం నశించడానికి శివలింగ ప్రతిష్ట చేసాడని, అదే రామేశ్వర క్షేత్రమని చెప్తారు. శ్రీ రామునకి హత్యపతకమా? లోక రక్షణ కోసం రావణ సంహారం చేసిన ధర్మమూర్తి కి పాపమా ?అందుకే కొందరు రామేశ్వర కధ కల్పితమని అంటారు . ఏది నిజం ?

సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి. వీటిని కాదనలేము. వాల్మీకి రామాయణం కావ్యం. కావ్యంలో క్షేత్ర, మంత్ర విషయాలుండవు. అవి ఆగమాలలో, పురాణాలలో చెప్పబడతాయి. ఆ మాటకొస్తే శ్రీరామ నామం తారకమంత్రం అనీ, ఉపాసనా విధానం కూడా రామాయణంలో లేవు. అంత మాత్రాన అవి కల్పితాలని అనలేము కదా! రామ ప్రాధాన్యం కల రామాయణంలో రామమంత్ర, ఉపాసనాదులు రహస్యంగా, గర్భితంగా నిబద్దం చేశారు వాల్మీకి. వాటిని పురాణాలు, మంత్ర శాస్త్రాలు విడమరచి అందించాయి. పురాణాలను కాదని వెళితే మనకీ క్షేత్రాలేవీ మిగలవు. భద్రాచలం లాంటి క్షేత్రాల గురించి కూడా రామాయణం చెప్పలేదు. పురాణం చెప్పింది.

ఇక - హత్యాపాతకం అంటారా? అంతరార్థాన్ని పరిశీలిద్దాం. శ్రీరాముడు నారాయణుడు. ధర్మమూర్తి. దుష్టసంహారం ఆయన విధి. అయితే దానిని సంకల్పమాత్రం చేత చేయగలదు. కానీ అవతరించి, అంత కథ నడిపి చేయాలా? అది ఆయన లీల మాత్రమే. ఆ లీలలో భాగమే ఇది కూడా.
సర్వశక్తి సంపన్నుడైన స్వామికి విశ్వామిత్రుని అస్త్రాలు ఎందుకు? ఆదిత్యహృదయం ఉపదేశం ఎందుకు? వానరుల సహాయం ఎందుకు? అన్నీ ధర్మాచరణలో భాగాలు. లీలా రచనలు.

క్షత్రియ ధర్మం ప్రకారం దుష్టశిక్షణ చేయాలి. అది తప్పనిసరి హింస. అయితే అందువల్ల పాపం రాదు కానీ, కొంత దోషం ఉంటుంది. ఆ దోషం ఉన్నా స్వధర్మంగా ఆ కర్మ చేసి, దోష నివారణార్థం ప్రాయశ్చిత్తం చేయాలి. శరీరంలో ఎక్కడైనా వ్రణం వస్తే శస్త్ర చికిత్స చేస్తారు. అది అనివార్యం. కానీ శస్త్ర చికిత్స చేయడం వల్ల వచ్చే 'ఇన్ఫెక్షన్' వంటివి పోవడానికి మరో మందును వాడతారు కదా! ఇన్ఫెక్షన్ కి భయపడో, మరో మందును వాడడానికి శంకించో చికిత్సను మానరాదు కదా! వాటికి పరిహారాలు చేసి చికిత్స చేయాలి. చికిత్సకు ముందు, వెనుక జాగ్రత్తలు తీసుకోవాలి. అది ధర్మం.

అలాగే క్షత్రియుడు ధర్మరక్షణార్థం శత్రు సంహారం చేసినా, అందులోని అనివార్యమైన హింసా దోష పరిహారార్థం పరిహారం చేయడం కూడా ధర్మంలో ముఖ్యం. అలాంటి దోశాలకే ప్రాయశ్చిత్తం. అంటే గానీ స్వార్థం కోసం చేసే అధర్మానికి ప్రాయశ్చిత్తం అంత తేలికకాదు. అనేక మంది రాజులు యుద్ధానంతరం శివాలయాలు ప్రతిష్ఠ చేసిన వైనాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇది సంప్రదాయం.

"యద్యదా చరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః
సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే!!

గీతాచార్యుని మాట. లోకానికి ఆదర్శాన్ని చూపే విష్ణువు తనకు అభిన్నమైన శిలనే ఆరాధించాడు. రాముడు ఎంత శివభక్తుడో, శివుడు అంతటి రామ భక్తుడు. ఒకరి హృదయం ఒకరు. ఒకరొకరిని పూజించడం అంటే పరస్పరం గౌరవించుకోవడం. అంతమాత్రాన ఒకరు ఎక్కవు - ఒకరు తక్కువ కాదు. ఉదాత్త చరిత్ర గలవారు ఇంకొకరి ఉదాత్తతని ఆరాధించదానికి వెనుకాడరు.